విజేత - పెబ్బిలి హైమావతి స్వాతి మాసపత్రిక నవల "విజయా.. విజయా!" అంటూ గావుకేక పెడుతూ ఇంట్లోకి వచ్చాడు సత్యరాజు. వంట గదిలో పని చేసుకుంటున్న రుక్మిణమ్మ కంగారుగా వచ్చారు ఆ కేకలు విని. లచ్చి రాజుగారి ఇంటి నుండి తెచ్చిన పుస్తకాలు పేజీలు తిరగేస్తూ ఉన్న విజయ కూడా వచ్చింది చేతిలో పుస్తకాలతో. "ఏమిటి అన్నయ్యా ఏం జరిగింది?" అంటూ ఆదుర్దాగా ప్రశ్నించింది రుక్మిణిమ్మ. "ఏమైందో దాన్ని అడుగు!" అన్నాడు సత్య రాజు విజయ వంక కోపంగా చూస్తూ.. విజయ ఏమీ అర్థం కానట్లు చూసింది అందరి వైపు. "చేసిందంతా చేసి ఎంత అమాయకంగా చూస్తున్నవే? నువ్వు అసలు రాచబిడ్డవేనా నడిరోడ్డు మీద సిగ్గు ఎగ్గు లేకుండా ఆ ఇకఇకలు పకపకలు ఏంటే? అయినా ఎవరినడిగి వెళ్ళేవే ఆ లచ్చి రాజు ఇంటికి? అంటూ తీవ్ర స్వరాన ప్రశ్నిస్తున్న సత్యరాజు వైపు దెబ్బతిన్నట్లు గా చూసింది విజయ. అంతలోనే సమాధానం ఏమీ చెప్పకుండ తలవంచుకుంది. నోటితో జవాబు చెప్పకపోయినా విజయ సూపుల్లో కనిపించే తిరస్కారం సత్య రాజుకు గంగ వెర్రులు ఎత్తించింది. దాంతో రెచ్చిపోయిన సత్య రాజు" ఏంటి ఆ చూపు? బొత్తిగా ...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!