Skip to main content

ఉదంకుడు : సర్పయాగం ప్రేరణ

      పైలుడి శిష్యుడు  ఉదంకుడు. ఒకరోజు పైలుడి భార్య ఉదంకుని పౌష్యుడు అనే రాజు భార్య వద్ద ఉన్న కుండలాలు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద  వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూశాడు. అతని కోరిక మేరకు ఆవు పేడ భక్షించి, ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత రాజుగారి  వద్దకు వెళ్లి తాను వచ్చిన పని గురించి చెప్పాడు.  పౌష్యుడు రాణిని అడిగి తీసుకోమని చెప్పాడు. ఉదంకుడు కుండలాల కోసం రాణి వద్దకు వెళ్ళాడు‌. కానీ రాణి ఉదంకునికి కనిపించలేదు. మళ్ళీ అతను రాజు వద్దకు వచ్చి, రాణి గారు కనిపించలేదని, ఆ కుండలాలు తమరే తెప్పించి ఇవ్వండని అడిగాడు. అప్పుడు రాజు రాణి అపవిత్రులకు కనబడదని అన్నాడు. అప్పుడు ఉదంకుడు తాను గోమయము భక్షించి ఆచమనము చేయకపోవడం వల్ల అపవిత్రుడను అయినందువల్లే రాణిగారు కనపడలేదని అనుకున్నాడు.

        ఉదంకుడు వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమనం చేసి రాణి వద్దకు వెళ్ళాడు. రాణి కనిపించింది. కుండలాలు తీసుకొని రాజు వద్దకు వెళ్ళాడు. 

       రాజు ఉదంకుని భోజనం చేసి వెళ్ళమన్నారు. ఉదంకుడు సరేనని భోజనం చేస్తుంటే ఆ భోజనం లో  ఒక వెంట్రుక ఉండటం గమనించిన ఉదంకుడు కోపంతో "నీవు నాకు అపవిత్రమైన భోజనం పెట్టావు కాబట్టి గుడ్డి వాడివై పో" అని  శాపం పెట్టాడు.

       అప్పుడు రాజు "నేను చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శాపం ఇచ్చావు కాబట్టి మీకు సంతానం కలగకుండు గాక" అని ప్రతిశాపం ఇచ్చాడు. 

      ఉదంకుడు తన తప్పు తెలుసుకుని "అయ్యా!  నాకు సంతానం కావాలి. దయచేసి తమ శాపం ఉపసంహరించుకోండి" అని రాజుని బ్రతిమిలాడాడు. 

      రాజులకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేకపోవడం వల్ల అది వీలుపడలేదు. కానీ  ఉదంకుడు రాజుకు ఇచ్చిన శాపం కొద్దికాలం తరువాత శాపవిమోచనం అవుతుందని చెప్పి  వెళుతుంటే దారిలో ఒక జలాశయం కనబడింది. ఉదంకుడు కుండలాలను ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టి తాను జలాశయము దిగి అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి తక్షకుడు వచ్చి కుండలాలను తీసుకుని పారిపోయాడు. ఉదంకుడు ఇది గమనించి తక్షకుని వెంబడించాడు. తక్షకుడు ఒక రంధ్రం గుండా నాగలోకానికి పారిపోయాడు.  ఉదంకుడు కూడా అతనితో పాటు నాగ లోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద గుఱ్ఱమును ఎక్కిన దివ్యపురుషుని చూశాడు. ఆ దివ్యపురుషుడు ఉదంకునితో తనకేం వరం కావాలో కోరుకోమని అడిగాడు. వెంటనే ఉదంకుడు  ఈ నాగకులమంతా నాకు వశవర్తులై ఉండాలని  వరం కోరుకున్నాడు. అలాగైతే నువ్వు ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని అన్నాడు దివ్యపురుషుడు. అలాగే చేశాడు ఉదంకుడు.  వెంటనే గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు పుట్టి  నాగలోకాన్ని చుట్టుముట్టాయి.

    నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. వెంటనే తక్షకుడు గడగడ వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. ఉదంకుడు ఆ దివ్యపురుషుడు ఇచ్చిన గుర్రం ఎక్కి గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు. గురుపత్నికి కుండలాలు ఇచ్చాడు.  

       గురుపత్ని కోరిక నెరవేరినందు వల్ల గురుదక్షిణ చెల్లించావని, విద్యాభ్యాసం పూర్తి అయిందని తాను కోరిన చోటికి వెళ్లవచ్చని ఉదంకునితో పైలుడు అన్నాడు. 

   ఉదంకుడు గురువుకు నమస్కరించి వెళ్లిపోయాడు.  తక్షకుడు తనకు చేసిన అపకారం మరవలేక పోతున్నాడు.  తక్షకుని మీద పగ తీర్చుకోవాలని జనమేజయ మహారాజు వద్దకు వెళ్లాడు.

     తక్షకుడు తనను మోసగించిన విధానం చెబుతూ, జనమేజయుని తండ్రి అయిన పరీక్షిత్తుని కూడా తక్షకుడే చంపాడని, కాబట్టి తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సర్పయాగం  చేయమని జనమేజయుని రెచ్చగొట్టాడు.

మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

            

     

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...