Skip to main content

                               గజల్ 

డిఎన్వీ రామశర్మ


తియ్యదనపు తేనెలాగ  

చేరుతుంది నీపిలుపే

నెయ్యమనుచు చల్లగాను 

మారుతుంది నీ పిలుపే


మాటలతో మురిపిస్తూ 

రాతిగుండె కరిగిపోయె 

ముదముతోడ పరవశమే 

పంచుతుంది నీపిలుపే


పట్టుచీర కట్టుకున్న 

చీరకేను అందమొచ్చె 

నడకతోడు కళలన్నీ 

నేర్పుతుంది నీ పిలుపే 


పరిమళాల సుమాలన్ని 

అల్లితినే నీకొరకే 

మనసుతట్టు భావములే 

నింపుతుంది నీపిలుపే


కలవరింపు చిగురించీ 

రాముడేను జతగూడే

రాలిపోవు కన్నీటిని 

తుడుపుతుంది నీపిలుపే

                        - డిఎన్వీ. రామశర్మ


        శ్రీ రామశర్మగారు వ్రాసిన ఈ గజల్ ప్రేయసి పిలుపులో ఉండే మాధుర్యాన్ని అనేక ప్రతీకలతో హృద్యంగా చెప్పారు.

         ముందుగా నీపిలుపే అనే రదీఫ్ తో మత్లా ఎత్తుగడలో ఒక చక్కని భావనతో ప్రారంభించారు

          ప్రేయసిపిలుపు తీయగా ఉందట. ఆ తీయదనంకూడా తేనెలాగ ఉంది.సృష్టిలో తీయదనానికి తేనెను మించిన పోలిక ఇంకొకటి ఉండదు. అందుకనే కవి తన ప్రేయసి పిలుపుని తియ్యదనపు తేనెతో పోల్చుతూ పరవశులౌతున్నారు.

         ఆపిలుపు స్నేహం చేయమంటూ చల్లగా మారుతుందట. పిలుపుతోనే ఆమెతో స్నేహంచేయాలనే భావన కలిగింది కవిగారికి.

        మొదటి షేర్ లో గుండెను రాతితో పోల్చడం.. అలాంటి రాతిగుండె కూడా ప్రేయసి మాటలతో కరిగిపోతుంది. అంతే కాదు ఆ కరిగిన రాతిగుండెలో సంతోషంతో పరవశాన్ని పంచుతోంది ప్రేయసి పిలుపు. ప్రేయసి పలుకులకు కరగని రాతి(మగ )గుండె ఉంటుందా!

       ఇక రెండవ షేర్లో ప్రేయసి పట్టుచీర కట్టుకుంటే చీరకే అందం వచ్చిందంటున్నారు కవిగారు. తా వలచింది రంభ.. అన్నట్లు పట్టుచీరేంటి ఏ చీర కట్టుకున్నా అందంగానే ఉంటుంది ప్రేయసి. ఇక ఆ చీరకట్టిన చిన్నది ఎన్ని కళలను నేర్పుతుందో! కవిగారు ఆవిడ నడకమీద ఒట్టేసి మరీ చెప్తున్నారు.. అంటే మనం నమ్మవలసిందేకదా!

         మూడవషేర్ లో ప్రేయసి పిలుపు మనసునుతట్టే భావాలని నింపుతుందట. మరి అలాంటి ప్రేయసికోసం పరీమళభరిత పుష్పాలతో మాలలల్లుతున్నాడు కవి.

         పదాలతో కూడా కవి చక్కని మాలలల్లుతున్నాడు.  మనసును తట్టే మధురభావాలు ప్రేయసి పిలుపుతో నింపుకోవడం కవి తాదాత్మ్యతకు ప్రతీక.

         ఆ ప్రేయసి కోసం కలవరించి.. ఆ కలవరింపులో ప్రేమ చిగురించి కవిగారు జతగూడారు.

        ఇక్కడ కవి ఆ ప్రేయసి నుంచి అలౌకికమైన విషయాన్ని అపేక్షిస్తున్నాడు. అదే తన కన్నీటిని తుడవడం. అంటే ప్రేయసి/భార్య/సఖి తోడు ఇహసౌఖ్యాలు పొందటానికి కాకుండా జీవితంలో వచ్చే ఒడిదుడుకులలో చెంత ఉండి కన్నీరు తుడవడానికి ఆ పిలుపు కావాలని కోరుతూ ఎంతో ఉదాత్తమైన భావాన్ని మక్తాలో పలికిస్తూ తన నామముద్ర(తఖల్లూస్)రాముడు ని చక్కగా గజల్ లో ఒదిగేలా చేసారు.

       గజల్ సాహిత్యంలో కృషిచేస్తూ.. నేర్చుకుంటూ.. నేర్పుతూ.. తనకున్నది తానే అనుభవించకుండా పంచుతూ, పెంచుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తున్న ఈ గజల్ కవి కలం నుండి మంచి తాత్వికత నింపుకున్న చక్కని.. చిక్కని గజళ్ళు రావాలని ఆశిద్దాం.



Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...