Skip to main content

 

Kommula venkata suryanarayana

          “ఆవిడే చాలా 'మంచి' ఆవిడ, ఒక్క పనీ నాచే చేయించేవారు కాదు. ఈయనేంటో ఒక్క పూచిక పుల్ల అక్కడిది తీసి ఇక్కడ పెట్టరు. ఒక పక్క ఇంట్లో పని, మరో పక్క కాలేజిలో టీచింగ్ తో చచ్చిపోతున్నాను. ఇంకా ఇలా ఎంతకాలమో ” వినపడేలాగే అంది నా కోడలు. 'ఆవిడ' అని ఉద్దేశించింది నా భార్య గురింఛి

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగినైన నేను, విశ్రాంతి అని నా పేరుకి చేరింది కదా అని  మా కొడుకు, కోడలు దగ్గర విశ్రాంతి తీసుకోవచ్చని ఆశపడి నా భార్యతో కలిసి  మా అబ్బాయి ఇంటికి చేరా. వచ్చిన కొద్దికాలానికే ఆప్యాయతలు ఆవిరయ్యాయి. అదృష్టం కొలదీ ఈ మధ్యకాలంలోనే నా కళ్ళముందే నా యిల్లాలు 'మంచి'దనిపించుకుంది. ఈ 'మంచి' అనే మాట వినిపించినప్పుడుల్లా నా మనసులోకి చాలా విషయాలు గుర్తుకొస్తాయి.

              ***

Retired man


“ఒరేయ్ ! రామం.. మీ నాన్న అంత 'మంచి' వ్యక్తిని మేమెపుడు చూడలేదురా, అసలు ఎవరినీ పల్లెత్తు మాట అన్నది ఎప్పుడూ వినలేదురా. నలుగురికి సాయపడటమే తప్ప, ఎవరినుండి ఏ సాయాన్ని ఎప్పుడూ ఆశించలేదు రా”. నాన్న చనిపోయిన తరువాత పార్ధివ దేహం చెంతన, అలాగే తర్వాత నాన్న ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ  నాన్న స్నేహితులు, అలాగే మా బంధువుల దగ్గర విన్న  ఆ మాటలు, ఆయన బతికుండగా ఎవరి దగ్గరనుండి నేను వినలేదు. 

వాళ్ళకే కాదు నాకూ అంతే, నాన్న మంచితనం, నాన్న పోయిన తర్వాత తెలిసింది.  ఎందుకంటే నా చిన్నప్పుడు నాన్నను బూట్లు కొనమంటే, నాన్న గూడ చెప్పులు కొనిచ్చాడు అని తిట్టుకున్న నాకు, నాన్న అసలు కాళ్ళకు జోడంటూ లేకుండా తిరిగిన విషయం గానీ, కాలేజికి వెళ్ళటానికి కొత్త సైకిల్ కావాలంటే , అప్పుడు తనకున్న డొక్కు సైకిల్ నాకు పడేసి కాలేజికి వెళ్ళమన్నాడని తిట్టుకున్న నాకు, ఆ సైకిల్ నాకు  ఇచ్చేసి తను ఎంతదూరమైనా నడిచి వెళ్ళివచ్చేవాడన్న విషయం గానీ, నాన్న చేత  బలవంతాన డొనేషన్ కట్టింపచేసి ,ఈనాటి నా ఈ ఉన్నత స్థితికి ఆనాడు తనకు ఆధారమయిన ఆ కొద్దిపాటి భూమిని అమ్మి, సొంతంగా వ్యవసాయం చేసుకునే నాన్న, కూలిగా మారిన పరిస్థితి గానీ ఇవేవీ అప్పుడు అనిపించనవి, ఇప్పుడు నా మనసును తట్టిలేపుతున్నాయి. చివరకు నాన్న కేన్సర్ తో బాధపడుతూ మా దగ్గర ఉన్నప్పుడు మా నిరాదరణ చూసి కాబోలు  “ఒరేయ్! రామం.. మన ఇంటికి వెళ్ళిపోతానురా, నా ఈడు వాళ్ళతో కాలక్షేపం చేస్తాను” అని మా ఊరు వెళ్ళిపోయి అక్కడే చనిపోయిన తర్వాత గానీ ఆ మాటలలో ఆంతర్యం ఏంటో, నాన్న స్వభావం ఏంటో అర్ధంకాలేదు. 

                    ***

    కాలం పరిగెత్తుకుంటూ పోయింది. నేను నాన్న స్థానంలోకి వచ్చాను.నేను ఎంత సహజంగా నాన్న మంచితనాన్ని అపార్ధంచేసుకున్నానో అంతే సహజంగా  ఇప్పుడు మా వాడికి నాలోని మంచితనం కనిపించటం లేదు. ఎందుకంటే వాడికేమో వేల ఖరీదు చేసే  షూస్ కొనమంటే నేను కొన్నదేమో వందల  ఖరీదైన షూస్. అలాగే లక్షల ఖరీదైన బైక్ కావాలంటే మరి నేను కొన్నది వేల ఖరీదైన బైక్. నేను కొన్నవి  నా స్థోమతకి మించినవే అయినా వాడి దృష్టిలో వాడు అడిగినవి కొనలేదు కాదు  కాబట్టి  మా వాడికి నేను మంచివాడిని కాదు .అలాగే ఎం.ఎస్., చేయడానికి అబ్రాడ్ వెళతానని చెప్పినప్పుడు,అది నా తాహతుకు మించినదని చెప్పినా, ఆఖరకు నా తల తాకట్టుపెట్టి  అబ్రాడ్ లో ఎం.ఎస్ చేయించవలసి వచ్చింది. ఎం.ఎస్ చేసి తిరిగొచ్చి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు.  తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని కాపురం పెట్టడం జరిగింది.

                    ***

ఇపుడు రిటైరైన తరువాత ఇదుగో ఇలా వాడి పంచన చేరవలసి వచ్చింది. గడియారంలో ముళ్ళుల్లా కాలచక్రం చక్రీయ భ్రమణం చేస్తూనే ఉంది. సంఘటనలూ అలాగే చక్రీయ భ్రమణమవుతున్నాయి కానీ  నేను మనుషులు మంచివాళ్ళు ఆనిపించుకోవడానికి ఏళ్ళ తరబడిగా నాలో  ఏర్పడి పోయిన నా భావనలో మాత్రం ఏ మార్పు రాలేదు. ఈ మధ్య నా కోడలి నోటినుంచి ఈ 'మంచి' అనే పదం వినీ వినీ నాకూ విసుగొచ్చేసి  నేనూ “మంచి”వాడిననిపించుకుంటే బాగుంటుందేమోనని అనిపిస్తుంది

          ***

     ఒక్కసారిగా ఊహలలోంచి బయటకొచ్చాను. అదే సమయంలో చూసిన మూడు సంఘటనలు మంచి అనే పదానికి ఏర్పరచుకున్న  నా భావాన్నే కాదు , నా నడవడికనే మార్చేసాయి. సరిగ్గా అదే సమయంలో బయట కైలాస రధంపై శవాన్ని తీసుకెళుతూ భగవద్గీత లోని శ్లోకం 'కర్మణ్యేవాధికారస్తే  మా ఫలేషు కదాచన….. కర్మలు చేయుట యందే నీ కధికారము కలదు , కర్మఫలమునకు హేతువు కారాదు' ఘంటసాల స్వరమాధుర్యంతో ఒక మేలుకొలుపు.. మనసులో ఒక బలమైన కుదుపు.. అవును! మంచివారు అనిపించుకోవటం కోసం వాళ్ళెవరూ ఆ పనులన్నీ చేసుకుపోలేదు, తమ పనులు తాము చేసుకుంటూ పోయారు. అట్లా నీ పని నీవు చేసుకుని పోవటమే.. ఫలితాన్ని ఆశించి చేయకు సుమీ.. అని భగవద్గీత శ్లోకం సూచిస్తే, రెండవది ఉపాధ్యాయ శిక్షణసంస్థలో మనస్తత్వశాస్త్ర అధ్యాపకురాలిగా  పనిచేస్తున్న మా కోడలు ఆ రోజు చెప్పబోయే పాఠానికి సంబంధించిన తయారుచేసుకున్న పిపిటి స్లైడ్ లో సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షకతంత్రం నిర్వచనాన్ని యాదృచ్చికంగా చూడటం తటస్థించింది. మనిషికి వివిధ కారణాల వల్ల ఏర్పడే  వ్యాకులత నుండి,సంఘర్షణల నుండి తనకి ఎదురయ్యే ఇబ్బందులను తప్పించుకోవడానికి, తను చేసే పనులను సమర్ధించుకోవడానికి ఉపయోగపడేలా ఏర్పరచుకున్న విధివిధానాలనే రక్షకతంత్రాలంటారు. అలా  'విశ్రాంత' అనే పదాన్నిరక్షకతంత్రంగా  పెట్టుకుని, నాలో  పనులు చేయగలిగే సత్తా  ఉన్నా పక్కనపెట్టి, వాలుకుర్చీలో కూర్చొని పేపర్ చదవడానికే పరిమితమైపోవడం అనేది ఆ రక్షకతంత్రం స్లైడ్ సూచిస్తే,   మూడవది బయట మామిడిచెట్టుకి ఉన్న కాయలను రాల్చడానికి రాళ్ళను చెట్టుమీదకి విసురుతున్న పిల్లవాడు కనిపించి, ఏమాశించి మామిడిచెట్టు ఇతరులకు ఫలాలనందిస్తుంది.తనపై రాళ్ళ వర్షం కురిపిస్తున్నా తన సహజ నైజాన్ని విడిచిపెట్టకపోవడాన్ని చూసేసరికి 'నీ కర్తవ్యం నువ్వు ఆచరించటం మానకు నీకు ఎదురుదెబ్బలెదురైనా' అని సూచించింది. అలా 'మంచి' అని అనిపించుకోవడానికి ఏర్పరచుకున్న  నా తప్పుడు భావనలన్నీ తొలగిపోయి, ఇప్పుడు నా కర్తవ్యమేమిటో నాకు  తేటతెల్లమైంది.

                    ***

        “అమ్మా! ఆ సంచి ఇటివ్వు.. పాల పేకట్లు తెస్తాను, అలాగే ఈ వారానికి కావలసిన కాయగూరలేంటో చెబితే తెచ్చిపెడతాను. మరోలా అనుకోకపోతే నా మనవడిని తీసుకుని రోజూ నా స్కూటర్ పై తీసుకెళ్ళి వాడిని కాన్వెంట్ లో దింపి సాయంత్రం వెళ్ళి తీసుకువస్తాను. వచ్చే నెల నుంచి స్కూల్ బస్ రావద్దొని చెప్పమ్మా” అన్నాను మా కోడలితో.

ఆనందాశ్చర్యాలతో కొడుకు ,కోడలు నిశ్చేష్టులై చూసారు నా వంక, అవును మరి వాళ్ళకి ఇదే కదా మొదటిసారి ఇటువంటి మాటలు వినడం నా నోటి నుంచి. 

                                 _-_


Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...