వీలునామా
ఏ కాకి ఊసేసిన గింజనో ఇలా అడవిలో ఏకాకిగా మిగిలిపోయాను ఎన్ని ఋతువులు కుదిపేశాయో ఎన్ని తుఫానులు పలకరించాయో
సరి సమానంగా అన్నింటినీ కౌగలించుకున్నా!
చిట్ట చివరికి నేను ఎదురుచూడని
ఒక చివరి వేసవి రానే వచ్చింది
ఆశలన్నీ శిశిరపు ఆకుల్లా రాలిపోయాయి.
ఎండుటాకులు మట్టి లో కలిసిపోయినా
తెలియనంత నిశ్శబ్ధం కమ్ముకుంది
వసంతం కోసం వేచిచూసే సమయం మిగల్లేదు!
ఏ గొడ్డ లో నన్ను నిట్టనిలువునా చీరేయ్యడానికి
అడవి లో వెదుక్కుంటూ తిరుగాడుతోంది!
దూర దేశాల ఊసులు చెప్పే పిట్టలు
తప్పించుకు తిరుగుతున్నాయి!
గాలి కూడా వాలడం లేదు
కార్చిచ్చుగా రగులుదామని కాపేసి కూర్చుంది!
స్థంభించిపోయిన శూన్యం దిగులుగా చూస్తోంది
ముగింపు కన్నా భరించలేనిది విషాదపు నిరీక్షణ
ఆత్మాహుతి చేసుకుందామంటే
చెట్టుకు చావడం. తెలీదు
ఏ చిట్టచివరి కట్టెగానో రగిలి
వెలుగును పంచాలి!
ఒక్క కడుపు అయినా నింపాలి!!
అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
హైదరాబాద్.
Comments
Post a Comment