జాతీయాలు
భావ వ్యక్తీకరణకు భాష ఉపయోగపడుతుంది. శ్రోతను ఆకట్టుకునేందుకు, చెప్పే విషయాన్ని మనస్సుకు
హత్తుకునేట్లు చెప్పడానికి జాతీయాలు, సామెతలు వాడుతుంటారు. ఇవి భాషకు అందాన్నిస్తాయి, జన వ్యవహారంలోనే
కాక సృజనాత్మక రచనల్లోనూ, పత్రిక భాషలోను, శైలి సౌందర్యంకోసం, భావ పటుత్వంకోసం జాతీయాలను
ప్రయోగిస్తుంటారు.
జాతీయం ప్రత్యేకత
జాతీయం అంటే - ప్రతి భాషలోనూ జాతీయాలకు ప్రత్యేక స్థానముంది. జాతీయాలు, శైలీసౌందర్యానికి, భావ
సౌభాగ్యానికి సమాజ సంస్కృతికి చిహ్నాలు. విషయ నివేదనలో భావగాఢతకు, అలంకార చమత్కృతికి ఇవి ఆలవాలం. ఏ భాషా వ్యవహర్తలయినా ఆ భాషలోని జాతీయాలను ఒంటపట్టించుకొని, సమయానుకూలంగా ప్రయోగించినపుడే భాషలో రాణిస్తారు.
ఒక విషయాన్ని స్పష్టంగా, మనుసుకు హత్తుకొనేట్టు చెప్పడానికి, ఆకర్షణీయంగా చెప్పడానికి జాతీయా
వాడతారు.
జాతీయాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఏకపదం
కూడా జాతీయం కావచ్చు.
జాతీయాలు లక్షణార్థ ప్రాధాన్యం కలవి. ఒక జాతీయంలోని పదాలన్నీ కలిసి సామూహికంగా
జాతీయంలోని పదాల అర్థంకాకుండా మరో అర్థానిస్తాయి.
జాతీయాలు ఏర్పడే విధానం
భాషా వ్యవహారంలో జాతీయాలు నిరంతరం సృష్టింపబడుతూనే ఉంటాయి. ఫలానా జాతీయం ఎప్పుడు పుట్టింది అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఒక వ్యక్తి ఒక భావాన్ని తన అనుభవాల నుంచి, పరిజ్ఞానం నుంచి విశిష్టంగా, వినూత్నంగా వ్యక్తం చేస్తాడు. అదే తర్వాత భాషలో నిలదొక్కుకుని ప్రజల్లో వ్యాపిస్తుంది. జాతీయాల పుట్టుకకు మూలం ఇదే.
విశిష్టార్థంలో వాడిన పదంగాని, పదబంధం గాని ఆ నోట ఈ నోట పడి భాషలో ప్రాచుర్యం పొంది, ఉమ్మడి సొత్తుగా మారి నిలదొక్కుకుంటుంది. పరివ్యాప్తమవుతుంది. సాంప్రదాయిక వ్యాప్తినొందుతుంది. కాబట్టి జాతీయాలకు ప్రజలే సృష్టికర్తలు, వాడకందార్లు, వారసులు.
జాతీయం అంటే
‘జాతీయాలు’ విడివిడి మాటల కలయికచే ఏర్పడి, ఆ పదాలకు విడిగాలేని ఒక భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఇలా కొన్ని పదాల కలయిక ద్వారా సామాజిక అర్ధాన్ని అందించే పదబంధాలు లేక పదసమూహమే 'జాతీయం' అని చెప్పవచ్చును.
జాతీయాలు మన భాషలో ఎలా ఇమిడి పోయాయో వివరించే కొన్ని ఉదాహరణలు:
సామాజిక సంబంధాలు :
వ్యక్తికి కుటుంబంలోనూ, సమాజంలోనూ ఉన్న సంబంధాల ఆధారంగా అనేక జాతీయాలు
ఏర్పడుతున్నాయి. సామాజిక జీవనంలో కష్టనష్టాలు, సుఖసంతోషాలు, సంబంధబాంధవ్యాలు, జీవితానుభవాలు, సంఘటనలు, సన్నివేశాలు జాతీయాలకు ఆలవాలమవుతున్నాయి. కడుపుతీపి, పుత్రశోకం, దశమగ్రహం, పెద్దన్నయ్య
పోకడ, వేలు విడిచిన మేనమామ మొదలైనవి కుటుంబంతోను, బంధుమిత్రులతోను గల సంబంధాల ఆధారంగా ఏర్పడినవే.
సమాజంలోని కులాలు, స్థలాలు సూచించే జాతీయాలు అనేకమున్నాయి. కుంభకోణం, చిదంబర రహస్యం, బొబ్బిలి
పులి, శ్రీరంగనీతులు మొదలైనవి అలాంటివి.
భౌగోళికం : ప్రకృతి, ప్రకృతిలోని మానవుడు, వృక్ష, జంతు జాలాల స్వరూప స్వభావాలను అనుసరించి అనేక
జాతీయాలు ఏర్పడ్డాయి. కడుపుతీపి, కడుపుమంట, కళ్ళు నెత్తిమీదుండు, కాలికిబుద్ధిచెప్పు, గొంతుకోయు, చేయి చేసుకొను, గుండెల మీద కుంపటి, చెవికోసుకొను, తలలో నాలుక, నోట్లోమన్నుపడు మొదలైనవి మానవ శరీరావయవాల ఆధారంగా
రూపొందాయి. అడవిగాచిన వెన్నెల, కుంభవర్షం, ఎండమావి ప్రకృతి ఆధారంగా ఏర్పడితే, బీరకాయ పీచు సంబంధం, మర్రిమాని పంట, మేడిపండు వృక్షసంపద ఆధారంగా ఏర్పడ్డాయి. ఉడుంపట్టు, కాకిగోల, కుందేటి కొమ్ము, కుక్కతోక,
గాడిద చాకిరీ, గొర్రెతోక,నక్కజిత్తులు, పాముపగ, మేకపోతు గాంభీర్యం, మొసలికన్నీరు మొదలైన జాతీయాలకు జంతువులు
స్వరూప స్వభావాలు ఆధారం.
సాహిత్యం - చరిత్ర : పురాణాలు, కావ్యాలు, ఆధునిక, జానపద సాహిత్యంలోని పాత్రలు, సన్నివేశాలు, ఇతివృత్తాలు, చారిత్రక వ్యక్తులు, సంఘటనలు వేలకొలది జాతీయాలకు మూలమవుతున్నాయి. ఇలాంటి జాతీయాలు ఆయాభాషా
సమాజాల్లోని సాహిత్యం, చరిత్ర, సంస్కృతి పట్ల వక్తకు, శ్రోతకు అవగాహన ఉంటేనే జాతీయాల ప్రయోజనం సిద్ధిస్తుంది.
రామాయణం ఆధారంగా అగస్త్యభ్రాత, ఉడతాభక్తి, కబంధహస్తాలు, కుంభకర్ణనిద్ర, రామరాజ్యం, రావణకాష్టం, వానర సైన్యం ఏర్పడితే మహాభారతం ఆధారంగా అజ్ఞాతవాసం, త్రిశంకుస్వర్గం, పద్మవ్యూహం, భీష్మ ప్రతిజ్ఞ, విశ్వామిత్ర సృష్టి, శల్యసారథ్యం మొదలైనవి ఏర్పడినాయి.
అలాగే జానపద కథలు, జానపద కళలు, ఆటలు ఆధారంగా దొందుదొందే, బాదరాయణ సంబంధం, రెంటికి చెడిన రేవడి, కీలుబొమ్మ, గంగిరెద్దు, చేతిచమురు భాగవతం, తందానతాన. పగటివేషగాడు, దాగుడు మూతలాడు మొదలైనవి రూపుదిద్దుకున్నాయి.
ఆచార వ్యవహారాలు : తెలుగు జనుల ఆచార వ్యవహారాల నుంచి అనేక జాతీయాలు జనించాయి.
అంకురార్పణచేయు, అందెవేసిన చెయ్యి, అసిధారావ్రతం, తిలోదకాలిచ్చు, పిలువని పేరంటం, బొట్టూకాటుక పెట్టి పిలిచు, మంగళంపాడు, మూడు ముళ్ళుపడు మొదలైనవి ఏర్పడ్డాయి.
సామెతలు ఆధారంగా : ప్రచారంలో ఉన్న కొన్ని సామెతలు కుదింపబడి, వాటిలో కొంతభాగం జాతీయంగా
వాడబడుతున్నాయి. తెలుగులో గుమ్మడికాయల దొంగ అనే జాతీయానికి గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు అనే సామెత; గురివింద గింజ అనే జాతీయానికి గురివింద గింజ తన నలుపు ఎరుగదట అనే సామెత ఆధారం.
అన్యదేశ్యాలు : సంస్కృతం, ఆంగ్లం వంటి భాషల నుండి కొన్ని జాతీయాలు యధాతధంగా చేరాయి. సంస్కృతం నుంచి అసూర్యం పశ్య, దశమగ్రహం. ఆంగ్లంనుంచి క్యాట్స్ అండ్ డాగ్స్, గుడ్బై, గ్రీన్ సిగ్నల్, రబ్బర్ స్టాంప్, రైట్ హాండ్, హాట్ కేకు మొదలైనవి చేరాయి.
పేరడీ జాతీయాలు : వ్యవహారంలో ఉన్న జాతీయాలకు పత్రికల్లో పేరడీలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పే
అంశాన్ని జాతీయానికి అన్వయించుకొని, అనుకరణగా వాడడం పేరడిలో కన్పిస్తుంది. పత్రికా భాషలో జాతీయాల కల్పన, మార్పులు చేర్పులు, నూతనార్థాల్లో వాడుక విస్తృతంగా ఉంది. మూడు పువ్వులు ఆరు కాయలకు, మంది
మూడు గ్రూపులారు, చిలికిచిలికి గాలివానకు చిలికిచిలికి రాజకీయం, నిత్యకళ్యాణం పచ్చతోరణంకు నిత్యకళ్యాణం నోట్లతోరణం అని పత్రికా భాషలో ప్రయోగాలున్నాయి.
జాతీయాలు :
*.అక్కున చేర్చుకొను = కౌగిలించుకొను
మంచి మార్కులు సాధించిన రవిని తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు.
*. అట్టుడికినట్లు = వాడివేడిగా
పాకిస్తాన్ దేశం తీవ్రవాద సమస్యతో అట్టుడికి పోతున్నది.
* అడుగున పడిపోవు = పేరు ప్రతిష్ఠలు దెబ్బతినుట
మన రాజకీయ నాయకులపై వచ్చిన వివిధ కుంభకోణాలతో మన దేశ ప్రతిష్ఠ అడుగున పడిపోయింది.
*. అపురూపం = వింతగా, అపూర్వంగా, ముద్దుగా
i) దేవాలయ గోపురాలపైన ఉన్న శిల్పాలు ఎంతో అపురూపంగా ఉన్నాయి.
ii) తల్లిదండ్రులు పిల్లలను అపురూపంగా చూసుకొంటారు.
* ఆబాలగోపాలం = ప్రతిఒక్కరు (బాలుని నుండి గోపాలుని వరకు)
టెలివిజన్ ఆబాలగోపాలాన్ని ఆనందింపజేస్తోంది.
*. అరికాలి మంటనెత్తికెక్కు= మండిపడటం
కొడుకు పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేదని తండ్రికి అరికాలి మంట నెత్తికెక్కింది.
*. అడవి గాచిన వెన్నెల = నిరుపయోగం
ఎన్ని డిగ్రీలు ఉన్నా ఉద్యోగం లేకపోతే ఆ చదువు అడవి గాచిన వెన్నెల వంటిది.
*. అడ్డదారిపట్టు = చెడు దారిలో నడచుట
పరీక్షలలో ఉత్తీర్ణులు కావడం కోసం చాలా మంది విద్యార్థులు అడ్డదారిపడతారు.
*. అంకురార్పణ = ప్రారంభించు
మా గ్రామంలో దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
*. అరణ్యరోదన = వృథా, దండుగ
వరద బాధితుల ఆర్తనాదాలు అరణ్యరోదన అయ్యాయి.
*. అశనిపాతం = పిడుగుపడ్డట్లు
విదేశాల్లో ఉన్న కుమారుడు మరణించాడన్న వార్త తల్లిదండ్రులకు అశనిపాతం అయ్యింది.
*. అరచేతిలో వైకుంఠం = చాలా తేలిక అని నమ్మించడం
నేటి రాజకీయ నాయకులు మాటమూటలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు
*. అగమ్యగోచరం = దిక్కుతోచని పరిస్థితి
తుఫానుకు నడి సముద్రంలో చిక్కుకున్న జాలరుల పరిస్థితి అగమ్యగోచరమయ్యింది.
*. అష్టకష్టాలు = ఎన్నో కష్టాలు
మనదేశంలో నిరుపేదలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు.
*. అల్లారు ముద్దుగా =చాలా ముద్దుగా
తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటారు.
* అట్టహాసం = ఘనంగా
మా అక్కపెళ్ళి చాలా అట్టహాసంగా జరిగింది.
*.అందెవేసిన చేయి = నేర్పరి
మహేంద్ర సింగ్ ధోనీ సిక్స్ లు కొట్టడంలో అందెవేసిన చేయి.
ఆణిముత్యం = విలువైనది
ఘంటసాల పాడిన ప్రతిపాట ఒక ఆణిముత్యమే.
* ఆపద్ధర్మం = ఆపదలో ధర్మమును పాటించుట
మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆపద్ధర్మంగా నియమించబడ్డారు.
* ఆపోశనపట్టు = బాగా అధ్యయనం చేయుట
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు పదునాలుగు భాషలను ఆపోశన పట్టారు.
* ఆటపట్టించు = ఎగతాళి చేయటం
బావ మరదళ్ళను ఆటపట్టిస్తాడు.
* ఆపాదమస్తకం = శరీరమంతా
నేను దారికి అడ్డంగా ఉన్న పాముని చూసి ఆపాదమస్తకం వణికిపోయాను.
* ఆరునూరుగు = ఏది ఏమైనప్పటికి
ఆరునూరైనా నేను ఆడినమాట తప్పను.
* ఆలవాలం = నిలయం, స్థానం
భారతదేశం కళలకు ఆలవాలము.
* ఇంటిదారిపట్టు = ఓడిపోయి వెనుదిరుగు
ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో శ్రీలంక భారత్ పై ఓడిపోయి ఇంటిదారిపట్టింది.
ఉడుతాభక్తి = చేతనైన సహాయం చేయుట
వరద బాధితులకు మా పాఠశాల ఉడుతాభక్తిగా సహాయం అందించింది.
* ఉనికి పట్టు = నిలయం, స్థానం
ధర్మవరం పట్టుచీరల తయారీకి ఉనికిపట్టు.
ఉర్రూతలూగించు = ఉత్సాహపరుచు
మైకేల్ జాక్సన్ డాన్స్ ప్రపంచ ప్రజలను ఉర్రూతలూగించింది.
* ఊపిరాడని = శ్వాస అందని
పట్టణాలలో కిక్కిరిసిన ఇళ్ళలో ఊపిరాడని బతుకులు బతకాలి.
* ఎముకలేని చేయి = దానగుణం కలిగిన
దానం చేయడంలో కర్ణునిది ఎముకలేని చేయి.
* ఏకగ్రీవంగా = ఒకే అభిప్రాయంగా
దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి.
* ఏ ఎండకా గొడుగు = సమయానుకూలంగా ఉండటం
నేడు రాజకీయ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు.
* ఏకాకి = ఒంటరి
అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏకాకి అయ్యాడు.
* కంకణం కట్టుకొను = ప్రతిజ్ఞ పూనుట
ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రభుత్వాలు కంకణం కట్టుకొన్నాయి.
* కంటిలో కారం కొట్టు = కళ్ళ ముందే మోసం చేయడం
గజదొంగ కంటిలో కారం కొట్టి సంచిలో ఉన్న డబ్బును దొంగిలించాడు.
* కడుపుతీపి = కన్నప్రేమ
తమ పిల్లలను తల్లిదండ్రులు కడుపుతీపితో ముద్దుగా చూసుకుంటారు.
* కడుపులు మాడ్చుకొను = ఆకలితో బాధపడు
మన దేశంలో ఎంతోమంది అనాథలైన బాలబాలికలు ప్రతిరోజూ ఆకలితో కడుపులు మార్చుకొంటున్నారు.
* కనువిప్పు = కళ్ళు తెరిపించు
జులాయిగా తిరిగే కుమారునికి చదువు విలువ తెలిసి కనువిప్పు అయింది.
* కరతాళ ధ్వనులు = చప్పట్లు కొట్టు
మా మిత్రుడు పాడిన పాటను విని ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేసారు
* కన్నుల పండుగ = కళ్ళకు ఆనందం కలిగించుట
విజయవాడలో దసరా నవరాత్రులు కన్నుల పండుగగా జరుపుతారు.
* కాలక్షేపం = సమయం వృథా చేయుట
విద్యార్థులు పరీక్షల సమయంలో కబుర్లతో కాలక్షేపం చేయకూడదు.
* కయ్యానికి కాలు దువ్వుట = తగాదాకు తయారగుట
పాకిస్తాన్ భారత్పై కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటుంది.
* కళ్ళునెత్తి కెక్కు= గర్వపడట
అధికార గర్వంతో కళ్ళునెత్తికెక్కుట మంచిది కాదు.
* కళకళలాడు = ఆనందాన్ని కలిగించుట
మా పాఠశాల వైజ్ఞానిక ప్రదర్శనతో కళకళలాడింది.
* కష్టఫలం = కష్టపడి సాధించుకున్నది
కష్టఫలం దక్కని రైతులు దయనీయమైన జీవితం గడుపుతారు.
ఎవరైనా తమ కష్టఫలాన్ని అనుభవించాలేగాని ఇతరుల మీద ఆధారపడకూడదు.
* కారాలు మిరియాలు నూరడం = మిక్కిలి కోపావేశాలను కలిగి ఉండటం.
చీకటిపడేసరికి ఇంటికి చేరకపోతే మా అమ్మగారు మా మీద కారాలు మిరియాలు నూరుతుంటారు.
* కాలయాపన = ఆలస్యం చేయటం
ఎప్పటి పని అప్పుడే చేయాలి గాని కాలయాపన పనికిరాదు.
*కాలధర్మం చెందడం = మరణించుట, చనిపోవుట
ఈ సంవత్సరం సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు కాలధర్మం చెందారు.
* కాలికి బుద్ధి చెప్పు = పారిపోవుట
కుక్కల అరుపులు విని దొంగలు కాలికి బుద్ధి చెప్పారు.
* కైంకర్యం చేయు = అపహరించు, స్వాహాచేయు
దేవాలయ మాన్యాలను చాలామంది కైంకర్యం చేసి బాగా బలిసిపోయారు.
* కొట్టిన పిండి = చాలా తేలిక
మా తమ్మునికి లెక్కలు చేయడం కొట్టిన పిండి.
* కొమ్ములు తిరిగిన = గొప్పవారు, ఆరితేరినవారు
ఎన్నికలలో కొమ్ములు తిరిగిన నాయకులకు కూడా ఓటమి తప్పలేదు.
* కొరివితో తలగోకుకొను = కోరికోరి కష్టాలు తెచ్చుకోవడం
దుర్మార్గులతో స్నేహం చేయడం కొరివితో తలగోకుకోవడమే.
హోరాహోరీ
* గగన కుసుమం = సాధ్యం కానిది
పర్యావరణ పరిరక్షణ గగనకుసుమమే అవుతున్నది.
* గజ్జెకట్టడం = పని ఆరంభించు
రంగయ్య గజ్జెకట్టిన రోజే విజయం సాధించాడు.
* గుండె రాయి చేసుకోవడం = ధైర్యంగా ఉండటం
చేతికొచ్చిన కొడుకు చనిపోయినప్పటికి రామయ్య గుండె రాయి చేసుకొని జీవనం సాగిస్తున్నాడు.
* గీటురాయి = బంగారం నాణ్యాన్ని నిర్ధారణ చేసేది.
మనిషిలోని మంచిలక్షణాలే ఆ మనిషి వ్యక్తిత్వానికి గీటురాళ్ళు.
* గుండెలు బరువెక్కడం = గుండెలు బాధతో నిండియుండటం
తన స్నేహితుడు ప్రమాదంలో చనిపోయాడన్న వార్త విని రవి గుండె బరువెక్కింది.
* గొడ్డలిపెట్టు = ప్రమాదం, అపాయం
ప్రాంతీయ విభేదాలు దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు.
చ
* చమత్కారం = నేర్పు
మా తెలుగు మాష్టారు ప్రతిమాటా చమత్కారంగా మాట్లాడతారు.
* చిందరవందర = చెల్లాచెదురుగా
తరగతిలో విద్యార్థులు పుస్తకాలను చిందరవందరగా పడవేశారు.
* చిక్కు బడిపోవు= ఇరుక్కు పోవుట
సముద్రంలోకి వెళ్లిన జాలరులు తుఫానులో చిక్కుబడిపోయారు.
* చీమకుట్టినట్లు = ఏమీ పట్టనట్లు
కాగ్ ఎన్ని అక్షింతలు వేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు.
* చెప్పులో రాయి = ఇబ్బంది పెట్టు
పరీక్షలలో ఇచ్చిన ప్రశ్న సరిగాలేక చెప్పులోని రాయిలా ఇబ్బంది పెట్టింది
* చెల్లాచెదరు = విడిపోవుట
పోలీసుల లాఠీ దెబ్బలకు ప్రజలు చెల్లాచెదరైనారు.
* చెవికోసుకొను = వినటానికి బాగా ఇష్టపడటం
మా నాన్నగారు ఘంటసాల గారి పాటలంటే చెవికోసుకుంటారు.
* చెవినిల్లుకట్టుకొని = పదే పదే చెప్పటం
మా అన్నయ్యను బాగా చదవమని చెవినిల్లుకట్టుకొని మా అమ్మానాన్న చెప్పినా వినక పరీక్షలలో తప్పాడు.
* చేజారిపోవు = ఊడిపోవు
అవినీతికి పాల్పడిన అధికారి ఉద్యోగం చేజారిపోయింది.
* తలమానికం = విలువైన
భారత రామాయణాలు భారతీయ సంస్కృతికి తలమానికాలు,
* తలలో నాలుక = చాలా అణకువగా ఉండుట
మా ఊళ్ళో రామారావు అనే వ్యక్తి అందరి విషయంలోనూ తలలో నాలుకలా ఉంటాడు.
* తామరతంపర = ఎక్కువగా
నేడు దేశంలో సమస్యలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి.
* తలదన్ను = అధిగమించు
క్రికెట్ ఆటలో గవాస్కర్ను టెండూల్కర్ తలదన్నాడు.
* తలాతోక తేల్చుకోలేక పోవడం = ఒక విషయాన్ని గురించి ఎటూ నిర్ణయించుకోలేకపోవుట,
నా మిత్రుడు భవిష్యత్తులో ఏం చదివితే బాగుంటుందో అనే విషయంలో తలాతోక తేల్చుకోలేక పోతున్నాడు.
* తహతహలాడు = ఉబలాటపడుట
రవి పరీక్షా ఫలితాల కోసం తహతహలాడాడు.
* తిలోదకాలిచ్చు = వదిలివేయు
నా మిత్రుడు 8వ తరగతితోనే చదువుకు తిలోదకాలు ఇచ్చాడు.
* తునాతునకలు = ముక్కలు ముక్కలు కావడం
రెండు వాహనాలు ఢీకొని తునాతునకలయ్యాయి.
* తూర్పారబట్టు = విమర్శించు
ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నాయి.
* తేనె పూసిన కత్తి = తియ్యగా మాట్లాడుట
మోసగాని మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయి.
* తోక ముడుచు = పారిపోవుట
పోలీసులను చూసిన దొంగలు తోకముడిచారు.
* తోడు నీడ = అండగా ఉండటం
అన్నదమ్ములు ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి.
నగారా = ప్రకటించడం
* పూర్వం ఏదైనా వార్తను ప్రకటించవలసి వచ్చినప్పుడు కోట
బురుజు మీద ఉండే నగారా మోగించేవాడు.
* నడుంబిగించు = పూనుకొను
సమాజంలోని దురాచారాలను రూపుమాపటానికి వీరేశలింగం గారు నడుం బిగించారు.
*నల్లేరుపై బండినడక = శ్రమ లేకుండా ఏ పనైనా చేయుట
తిరుపతి వేంకట కవులకు అవధానం చేయుట నల్లేరుపై బండి నడకలాంటిది.
* నిండు కుండ = తొణకని, సామర్థ్యం కలిగి
కొందరు ఎన్ని కష్టాలు ఎదురైనా నిండుకుండలా ఉంటారు.
* నిమ్మకు నీరెత్తినట్లు = ఏమీ పట్టనట్లు
గ్రామాలను వరదలు ముంచెత్తుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది.
* నీరుకారి పోవడం = నిరుత్సాహపడడం
కొందరు ప్రతి చిన్న సంఘటనకు నీరుకారిపోతుంటారు.
* నీళ్ళు నమలు=తడబడుట
ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక విద్యార్థులు నీళ్ళు నమిలారు.
* నేల ఈనినట్లు = జనం ఒక చోట గుంపుగా చేరుట వివేకానందుని సభలకు ప్రజలు నేల ఈనిందా అన్నట్లు వచ్చేవారు.
* పఠనీయ గ్రంథం = చదువదగ్గ గ్రంథం
భారత, రామాయణాలు పఠనీయ గ్రంథాలు.
*పానకంలో పుడక = మధ్యలో ఆటంకం కలిగించుట
మా అన్నయ్య ప్రతి విషయంలోనూ పానకంలో పుడకలాగా అడ్డుపడుతుంటాడు.
* పక్కలో బల్లెం = మన పక్కనే దాగి ఉన్న శత్రువు
పాకిస్తాన్ దేశం భారతదేశానికి ఎప్పుడూ పక్కలో బల్లెమే.
* పగటికల = జరగని పని
బాగా చదవకుండా మార్కులు బాగా రావాలి అనుకోవడ పగటికలే అవుతుంది.
* పట్టరాని దుఃఖం = ఆపుకోలేని ఏడుపు
కన్న కూతురు తమ ముందే చనిపోతే పట్టరాని దుఃఖంతో తల్లిదండ్రులు కుమిలిపోతారు.
* పట్టుగొమ్మ = ఆధారం
తెలుగు సాహిత్యం గొప్పతనానికి సామెతలు, జాతీయాలు పట్టుగొమ్మలు.
* పప్పులో కాలువేయు = పొరపాటు చేయు.
మా మిత్రుడు ఒక ప్రశ్నకు మరొక ప్రశ్న జవాబు వ్రాసి పప్పులో కాలు వేశాడు.
* ప్రాకులాడు = ప్రయత్నం చేయటం
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రాకులాడుతుంటారు.
* పుణికిపుచ్చుకొను = కలిగియుండుట
కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల గుణాలను పుణికిపుచ్చుకొని ఉంటారు.
* పుట్టినిల్లు = జన్మస్థానం
భారతదేశం ఎన్నో కళలకు పుట్టినిల్లు.
* పుస్తకాల పురుగు = పుస్తకాన్ని వదలకుండా చదువుట
రవి పుస్తకాల పురుగుగా మారి మెడిసిన్ లో సీటు సంపాదించాడు.
* పెడచెవిన పెట్టు = వినకుండుట
పెద్దలు చెప్పే మంచిమాటలను పిల్లలు పెడచెవిన పెట్టకూడదు.
* పొద్దస్తమానం = పగలంతా
పల్లెటూళ్ళలో వ్యవసాయపు పనులు పొద్దస్తమానం చేస్తేగానీ పంట చేతికి రాదు.
* భగీరథ ప్రయత్నం = శ్రమపడుట
మా అన్నయ్య భగీరథ ప్రయత్నం చేసి విదేశంలో ఉద్యోగం సంపాదించాడు.
* బ్రహ్మరథం పట్టు = మెచ్చుకొను, పొగడుట
ఎన్.టి.రామారావు రాజకీయ రంగప్రవేశాన్ని చూసి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
* మంత్రాలకు చింతకాయలు రాలడం =మాటలు చెప్పడంవల్ల పనులు కావు.
మంత్రాలకు చింతకాయలు రాలనట్లే కష్టపడనిదే ఫలితం దక్కదు.
* మిన్నందుకోవడం = అసాధ్యాన్ని సాధించుట
మానవుడు రాత్రింబవళ్ళు చేసిన మేధోమథనం వల్లనే అభివృద్ధిలో మిన్నందుకొన్నాడు.
* మూడు పువ్వులు ఆరుకాయలు = అభివృద్ధి చెందు
నేడు విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుచున్నది.
* మేక వన్నె పులి = పైకి మంచిగా కనబడే దుర్మార్గుడు
కిషోర్ తన గ్రామంలో మేక వన్నె పులి లాంటి వాడు.
* యథాతథంగా = ఉన్నది ఉన్నట్లుగా
కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన సమాధానాలు యథాతథంగా వ్రాస్తారు.
* రసాభాస = గందరగోళ పరిస్థితి
గ్రామ సభలో నాయకులకు మాటామాటా పెరిగి సభ రసాభాస అయ్యింది.
* రూపుమాపు = దేనినైనా పూర్తిగా తొలగించుట
కందుకూరి వీరేశలింగం పంతులుగారు సాంఘిక దురాచారాలను రూపుమాపారు.
*వణికి పోవుట = గజగజలాడు
ఉత్తర భారతదేశంలోని ప్రజలు చలికి గజగజలాడిపోయారు.
* వీనులవిందు = చెవులకు ఆనందం కలిగించు
ఎస్. సుబ్బలక్ష్మి గారి సంగీతం ప్రేక్షకులకు వీనులవిందు చేసింది.
* వెన్నతో పెట్టిన విద్య = పుట్టుకతోనే వచ్చిన విద్య
సచిన్ కి క్రికెట్ ఆడుట వెన్నతో పెట్టిన విద్య.
* వేలెత్తి చూపు = చేసిన తప్పును ఎత్తి చూపుట.
నాయకులు చేసే తప్పులను ప్రజలు వేలెత్తి చూపడంలో తప్పేమీ లేదు.
* వేరుపురుగు = నాశనం చేయు
దుర్జనులు దేశానికి వేరుపురుగుల్లాంటివారు.
* శ్రీకారం చుట్టు = ప్రారంభించుట
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింది.
* శ్రీరామరక్ష = అపాయం లేకుండా
పెద్దలు, తల్లిదండ్రుల ఆశీస్సులే పిల్లలకు శ్రీరామరక్షలా ఉంటాయి.
* సాన్నిధ్యం = సమీపం, దగ్గర
పండితుల సాన్నిధ్యంలో గడిపితే కొంత జ్ఞానమైనా అబ్బుతుంది.
* సునాయాసంగా = తేలికగా, అవలీలగా
ఒక రోజు క్రికెట్ ఆటలో సచిన్ సునాయాసంగా వందపరుగులు సాధించాడు.
* స్వస్తి చెప్పు = వదిలివేయు
మా మిత్రుడు చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పాడు.
* స్వస్తివాచకం = విరమించడం, పూర్తయింది.
పెద్దలు తను ప్రసంగం పూర్తి కాగానే స్వస్తివాచకం పలుకుతారు.
* హోరాహోరీగా = చాలా తీవ్రంగా
ఇరాన్ - ఇరాక్ దేశాలమధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది.
* హెూరు గాలి = తీవ్రమైన ధ్వనితో కూడిన గాలి
సముద్రపు హెూరు గాలిలో పక్కవారి మాటలే స్పష్టంగా వినబడవు.
Comments
Post a Comment